స్తూపం భూములు పరిరక్షించాలి: సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి

స్తూపం భూములు పరిరక్షించాలి: సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి

హుస్నాబాద్, TG24TV: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఉన్న ఆసియా ఖండంలోనే అతిపెద్ద అమరవీరుల స్తూపం భూములను పరిరక్షించే బాధ్యతను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక జేఏసీ నాయకులతో కలిసి అమరవీరుల స్తూపం, దాని పరిసర భూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్తూపం భూములను కాపాడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.స్తూపం నిర్మాణం కోసం గతంలో 4 ఎకరాల సీలింగ్ భూమిని కేటాయించారని, అయితే హైకోర్టు తీర్పుకు సంబంధించిన ఫైల్ కనిపించడం లేదని రెవెన్యూ అధికారులు చెప్పడం ఆందోళనకరమని పేర్కొన్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ స్తూపం భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలని, సీలింగ్ భూములు పేదల ప్రయోజనాలకే ఉపయోగపడాలని ఆయన అన్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అమరవీరుల స్తూపం భూముల పరిరక్షణ కోసం స్థానిక జేఏసీ నాయకులతో కలిసి చేపట్టే భవిష్యత్ ఉద్యమాలకు సీపీఐ పూర్తి మద్దతు ఉంటుందని చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి, కో-కన్వీనర్ వీరన్న యాదవ్, సీపీఐ నాయకులు గడిపె మల్లేశ్, మల్కిరెడ్డి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.