
చిట్టిగిద్దలో ఎర్ర మట్టి తరలింపుపై వివాదం
చిట్టిగిద్దలో ఎర్ర మట్టి తరలింపుపై వివాదం సీసీ రోడ్ల పనుల పేరుతో అక్రమ రవాణా జరుగుతోందా? అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థుల ఆగ్రహం వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం చిట్టిగిద్ద గ్రామంలో ఎర్ర మట్టి తరలింపు వివాదం చర్చనీయాంశంగా మారింది. సీసీ రోడ్ల పనుల పేరుతో భారీ ఎత్తున ఎర్ర మట్టిని ప్రైవేటు వ్యక్తులకు తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ టిప్పర్ల ద్వారా మట్టి రవాణా జరుగుతున్నా రెవెన్యూ, గనుల శాఖ, పోలీసు అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ వాహనాల రాకపోకలతో గ్రామ రహదారులు దెబ్బతిని, వర్షాల కారణంగా బురదమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. మట్టి తరలింపుకు అన్ని అనుమతులు ఉన్నాయా? ఉంటే వాటి వివరాలను బహిరంగంగా వెల్లడించాలని, ఒకవేళ అక్రమాలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత శాఖల అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది.

సిపిఎస్ ను రద్దుచేసి ఒపిఎస్ ను పునరుద్ధరించాలి
తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) పిలుపు మేరకు పెన్షన్ విద్రోహ దినాన్ని పురస్కరించుకుని ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో స్థానిక తహసీల్దార్‌కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా టీజేఏసీ కో-కన్వీనర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానం ఉద్యోగులకు శాపంగా మారిందని, వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బోరెల్లి వెంకటేష్ మాట్లాడుతూ పెన్షన్ ఉద్యోగుల హక్కు అని, పీఎఫ్‌ఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. డీటీఎఫ్ జిల్లా నాయకులు శాంతన్న పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో టీజీఈజేఏసీ భాగస్వామ్య సంఘాల నాయకులు ఏ. వెంకటేష్, చంద్రశేఖర్, చంద్రుడు, బద్రు నాయక్, మల్లికార్జున్, శ్రీధర్, గోపీనాథ్, బాలాజీ, కిరణ్ కుమార్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.